ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. చంపావత్ జిల్లా పూర్ణగిరిలో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
నార్త్ ఇండియాలో బుధవారం నుంచి ఛైత్ర నవరాత్రి వేడుకలు షురూ అయ్యాయి. ఇందులో భాగంగానే ఉత్తరాఖండ్ లో పేరు గాంచిన పూర్ణగిరి మేళాకు యావత్ ఉత్తర భారతం నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఉత్తర ప్రదేశ్ నుంచి కొందరు భక్తులు తరలివచ్చారు.
పూర్ణగిరిలోని ఓ బస్టాండ్ వద్ద భక్తులంతా రాత్రిపూట నిద్రపోయారు. దైవదర్శనానికి వచ్చిన వారివైపు బస్సు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే ఐదుగురు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణం బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.