ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఒక్కసారిగా భారీ ఫ్లాష్ లైట్ దర్శనమిచ్చింది. రష్యా దాడులు కొనసాగిస్తున్న వేళ ఈ ఘటన ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. వైమానిక దాడి అయి ఉండొచ్చని కీవ్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, నాసాకు చెందిన ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించడం వల్లే ఇలా జరిగినట్లు అధికారులు తెలిపారు.
‘‘కీవ్ గగనతలంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. వైమానిక దాడి జరుగుతోందేమోనని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు గగనతల రక్షణ వ్యవస్థ పనిచేయడంలేదు. కానీ, ఆ వెలుగు నాసాకు చెందిన ఉపగ్రహం భూమిపై కూలిపోయే సమయంలో వచ్చిందని వాయుసేన తెలిపింది’’ అని కీవ్ సైనిక పరిపాలన అధికారి ఒకరు తెలిపారు.
ఈ దృశ్యాలను పలు ఛానళ్లు ప్రసారం చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీమ్స్‌లో వైమానిక దళం గుర్తులను వినియోగించకూడదని ఎయిర్‌ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. కాలం చెల్లిన ఓ ఉపగ్రహం బుధవారం భూ వాతావరణంలోకి ప్రవేశించనుందని నాసా వారం క్రితమే చెప్పిన విషయం తెలిసిందే.