మోదీ పర్యటన వేళ.. రామగుండంలో ఫ్లెక్సీల కలకలం

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రామగుండలో ప్రధాని పర్యటనకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మోదీని అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోదీ టూర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మరికాసేపట్లో మోదీ పర్యటన షురూ కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రామగుండం పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలకు సంబంధించిన ప్రశ్నలున్నాయి.

ఐటీఐఆర్‌ ఏర్పాటు ఎంత వరకు వచ్చింది, టెక్స్‌టైల్‌ పార్కు ఏమైంది, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయింది, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్‌ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారు, పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఐఐఎం ఏమైంది.. అంటూ పలు రకాల ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు. ఇప్పటికే చేనేతపై విధించిన జీఎస్టీని ఎత్తివేసిన తర్వాత తెలంగాణకు రావాలని పేర్కొంటూ అక్కడక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news