ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. అందులో భాగంగానే ఆ సేల్ జరిగే తేదీలను ఫ్లిప్‌కార్ట్ శనివారం ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు ఆ సేల్ కొనసాగనుంది. ఈ క్రమంలో సేల్ లో భాగంగా అనేక ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లను అందించనున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు సేల్ అక్టోబర్ 15వ తేదీ నుంచే అందుబాటులోకి వస్తుంది. సేల్‌లో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తారు. బజాజ్ ఈఎంఐ కార్డుతోనూ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్ బ్యాక్‌ను అందిస్తారు.
సేల్‌లో బాగంగా మొబైల్స్, టీవీలు, హోం అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు తదితర అనేక ఉత్పత్తులపై ఆకట్టునే ఆఫర్లు, రాయితీలను అందిస్తారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందించే అనేక ఆఫర్ల వివరాలను వినియోగదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. కాగా మరో వైపు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కానీ ఆ సంస్థ ఆ సేల్ తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీని ప్రకటించింది కనుక అమెజాన్ కూడా సేల్ తేదీని త్వరలోనే ప్రకటిస్తుందని తెలుస్తోంది.