ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ భారతీయ ప్రాంతీయ భాషా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అందులో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్ లేదా హిందీలో మాత్రమే వినియోగదారులు సైట్‌ను వీక్షించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సైట్‌ను వీక్షించవచ్చు.
కాగా దేశంలో రోజు రోజుకీ ఇంటర్నెట్ను వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక అనేక మంది ఇంగ్లిష్, హిందీ కన్నా ప్రాంతీయ భాషలను ఎక్కువగా వాడేందుకు మక్కువ చూపిస్తున్నారు. 2021 వరకు దేశంలో ఇలా తమ మాతృభాషల్లో ఇంటర్నెట్ను వాడే వారి సంఖ్య 75 శాతం వరకు పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. అందువల్లే ప్రాంతీయ వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు కొత్తగా 3 భాషలను ప్రవేశపెట్టామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.
ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ సేవ ప్రస్తుతం యాప్‌లో అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్ సైట్లో అందుబాటులో ఉన్నట్లు వివరాలు వెల్లడించలేదు. కానీ ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్తే.. అక్కడ ఉండే లాంగ్వేజ్ విభాగంలో ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ భాషలు కూడా కనిపిస్తున్నాయి. వాటిలో వినియోగదారులు తమకు నచ్చిన భాషను ఎంచుకుని ఆ భాషలోనే ఫ్లిప్‌కార్ట్‌ను వీక్షించవచ్చు.