సీఎం కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రైతులు మోస పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వరి వేస్తే.. ఉరి అని కేసీఆర్ చెప్పడంతో రాష్ట్రంలో చాలా మంది రైతులు వరి పంటను సాగే చేయలేదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో వారు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. వరి సాగు చేయక రైతులు తీవ్ర నష్ట పోయారని విమర్శించారు.
వరి సాగు చేయని రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి సాగు చేయలేని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి సాగు చేస్తున్త వారి కోసం రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్.. ఇప్పుడు వరి సాగు చేయలేని వారి కోసం రూ. 1,500 కోట్లు భరించలేరా.. అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ ను నమ్మి మోసపోయిన రైతులను.. కేసీఆర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.