తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ టూర్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న వ్యవసాయ విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ విధానం దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎకరం భూమిలో ఆవరేజ్‌గా 30 క్వింటాళ్లు రైతులు పండించిన పంటలో కేవలం 15 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.
రైతు చనిపోతే రైతు బీమా కింద రూ.5లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నమని, ఇలాంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ విధానం అమలు చేయాలని, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాలని వినోద్ కుమార్ హితవు పలికారు.