ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. దీపావళి పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ ఈ దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు. మంగళవారం బులంద్ శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వారందరికి సిలిండర్ ధరను రూ.300 మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని తెలిపారు.
ఇతర బీజేపీ పథకాలను హైలైట్ చేస్తూ.. పీఎం ఆవాస్ యోజన కింద ఉత్తరప్రదేశ్‌లో 55 లక్షల మంది మహిళలు ఇంటి యజమానులుగా మారారని, ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కింద రాష్ట్రంలో 2.75 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని ముఖ్యమంత్రి చెప్పారు.”గత తొమ్మిదేళ్లలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మనమందరం కొత్త భారతదేశాన్ని చూశాము. ఈ కొత్త భారతదేశం సంపన్నమైనది, శక్తివంతమైనది, స్వావలంబనతో కూడుకున్నది” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2014 తర్వాత దేశంలోని యువత, మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు, పౌరులకు కొత్త భారతదేశం ప్రయోజనం చేకూర్చిందని ఆయన అన్నారు.