చిన్నవయసులో జెండా పట్టి.. రహస్య రేడియోతో పోరాటం చేసి..

-

ఆమె తండ్రి బ్రిటిష్‌ ప్రభుత్వంలో న్యాయమూర్తి… సంపన్న కుటుంబం… సకల సౌకర్యాలు… కానీ వాటన్నింటినీ తోసి రాజని… స్వాతంత్య్రం అంటే ఏంటో తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి జెండా పట్టింది. చిన్ననాటి స్ఫూర్తినే జీవితమంతా నింపుకొని… అజ్ఞాతంలోకి వెళ్లి బ్రిటిష్‌వారిని పరుగులెత్తించింది. పెళ్లి కూడా వద్దనుకొని జాతీయోద్యమానికే అంకితమైంది. తనే డాక్టర్‌ ఉషా మెహతా!

ఇంట్లో ప్రతిఘటనతో మొదలైంది ఉష జీవితం. 1920 మార్చి 25న సూరత్‌కు దగ్గర్లోని సరస్‌ అనే గ్రామంలో జన్మించిన ఆమె పాఠశాలలో ఉన్నప్పటి నుంచే స్వాతంత్య్ర సమరానికి ఆకర్షితులయ్యారు. తన ఎనిమిదేళ్ల బిడ్డ సైమన్‌ గోబ్యాక్‌ అంటూ నల్లజెండా పట్టుకోవటం… న్యాయమూర్తి అయిన తండ్రికి ఇబ్బంది కలిగించింది. దీంతో కట్టడి చేశారు. 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నినాదంతో ఉషది చిన్నపిల్ల మనస్తత్వం కాదని ఆయనకు అర్థమైంది. బయటికి వెళితే తండ్రికి ఇబ్బంది అవుతుందని… సముద్రపు నీటిని ఇంటికే తీసుకొచ్చి ఉప్పు తయారు చేయటం ఆరంభించింది.

తండ్రి పదవీ విరమణ చేయటంతో… ఉషకు పగ్గాల్లేకుండా పోయాయి. 1933లో కుటుంబం ముంబయికి మారటంతో జాతీయోద్యమంలో పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం దొరికింది. కాలేజీలో చేరగానే మంజర్‌ సేన (పిల్లల సేన)ను స్థాపించారు. ఉద్యమకారులకు సాయం చేయటం; జైలుకెళ్లినవారి కుటుంబాలకు సందేశాలు చేరవేయటం, సమావేశాల వివరాలను, కరపత్రాలను పంచటంతో పాటు ఆంగ్లేయులను ఆటపట్టించేవారు ఈ సేన సభ్యులు. 1939లో తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఉష… లా చేయటానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే రెండో ప్రపంచయుద్ధం; కాంగ్రెస్‌ పూర్ణస్వరాజ్‌ డిమాండ్‌తో… దేశంలో పరిస్థితులు ఉద్విగ్నంగా మారాయి.

ఈ దశలో ఉద్యమం ముఖ్యమని భావించిన 22 ఏళ్ల యువ ఉష చదువుకు విరామం ప్రకటించారు. వివాహం చేసుకోకుండా జాతీయోద్యమానికే అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. 1942 ఆగస్టు 8న ముంబయిలో గాంధీ ఇచ్చిన చావోరేవో… పిలుపుతో కదిలిపోయిన ఉష… కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్యమ తీవ్రతను గమనించిన బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీజీ సహా అందరినీ జైళ్లలో పెట్టేసింది. ఎక్కడికక్కడ అరెస్టులే. క్విట్‌ఇండియా నినాదం ప్రజలకు చేరకుండా సర్కారు ఆంక్షలు విధించింది.

1947 తర్వాత కూడా గాంధీజీ చూపిన బాటలో పయనిస్తూ… ఖాదీ దుస్తులే ధరిస్తూ, బస్సుల్లో ప్రయాణం చేస్తూ సామాన్య జీవితం గడిపారు. గాంధీ సిద్ధాంతాలపై పీహెచ్‌డీ చేసి కళాశాలల్లో బోధించిన ఆమె స్వతంత్ర భారతంలో అవినీతిని చూసి బాధపడేవారు.

‘బలిదానాలిచ్చింది ఇలాంటి స్వాతంత్య్రం కోసమా. కానే కాదు. అయినప్పటికీ ఈ దేశం పట్ల విశ్వాసంగా ఉండటం మన బాధ్యత’ అంటూ బోధించిన డాక్టర్‌ ఉషామెహతా.. పద్మవిభూషణ్‌ సత్కారాన్ని అందుకొని… 2000 ఆగస్టు 11న కన్నుమూశారు.

42.34 మీటర్స్‌పై… 1942 ఆగస్టు 14న… ‘వినండి కాంగ్రెస్‌ రేడియో…42.34 మీటర్స్‌పై’ అంటూ… వాయు తరంగాలుగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఉషామెహతా! హిందుస్థాన్‌ హమారా గీతంతో మొదలై వందేమాతరంతో ముగిసే ఈ కార్యక్రమంలో… గాంధీజీ క్విట్‌ ఇండియా పిలుపుతో పాటు… ముఖ్యనేతల ప్రసంగాలు వినిపించేవారు. యావద్దేశం వీటిని చెవులు రిక్కిరించుకొని వినేది. బ్రిటిష్‌ సర్కారు ప్రసార సాధనాలపై ఆంక్షలు విధించిన పరిస్థితుల్లో ఉష రేడియో అందరికీ సమాచార వారధిగా నిలిచింది.

షికాగో రేడియో యజమాని నంకా మోత్వానీ యాంత్రిక, సాంకేతిక సహకారం అందించటంతో… విఠల్‌భాయ్‌ జావేరి, చంద్రకాంత్‌ జావేరి, బాబూభాయ్‌ ఠక్కర్‌లతో కలసి ఉష ఈ రేడియోను నడిపారు. ఉలిక్కిపడ్డ బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటనే వీరివెనక పడింది. దీంతో సర్కారు దృష్టిని మళ్లించటానికి, బ్రిటిష్‌ రాడార్‌ను తప్పించుకోవటానికి ఎప్పుడూ ఒకేచోటు నుంచి కాకుండా వివిధ ప్రదేశాల నుంచి ప్రసారాలు చేసేవారు. బ్రిటిష్‌వారిని పరుగులెత్తించిన ఉష బృందం… తమ బృందంలోని ఓ సాంకేతిక నిపుణుడి మోసంతో 1942 నవంబరు 12న దొరికిపోయింది. ఉషకు నాలుగేళ్ల కఠినకారాగార శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె అనారోగ్యంతో బాధపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news