TELANGANA : ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 11న (గురువారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చ జరపనుంది.

ఎఫ్‌ఆర్‌ఎంబీకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది. 53 వేల కోట్లలో కేంద్రం 15 వేలు కోట్లు కోత విధించినట్లు ఇటీవల సీఎం కేసీఆర్‌ తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి.  ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్‌లో చర్చిస్తారు.

 కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. శాసనసభ ప్రత్యేక సమావేశం, స్థానికసంస్థల సమావేశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.

వీటితోపాటు పాలనాపరమైన అంశాలు, రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news