ధరణి పోర్టల్‌లో చాలా రకాల సాంకేతిక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఓ కొత్త సాంకేతికను తీసుకువస్తోంది. ఈ పోర్టల్ లో భూయజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికోసం ‘తరుచూ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి (ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్- ఎఫ్‌ఏక్యూ)’ అనే సాంకేతికతను పోర్టల్‌లో ఏర్పాటు చేయనున్నారు.
రైతులు, రెవెన్యూ సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం ఎలా పొందాలనే సూచనలను ఎఫ్‌ఏక్యూ ద్వారా అందించనున్నారు. ఎదురైన సమస్యను పోర్టల్‌లో ఇచ్చే ఐచ్ఛికంపై నమోదు చేస్తే.. దానికి ఏంచేయాలి, ఎవరిని కలవాలి, ఇంతకుముందు ఎదురైన సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గం ఏమిటనేది కనిపిస్తుంది.
ఇప్పటివరకు ధరణి జిల్లా కోఆర్డినేటర్ లేదా టోల్‌ఫ్రీ నంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు సరైన సమాధానం వెంటనే అందించేలా కొద్దిరోజుల్లో ఎఫ్‌ఏక్యూను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు.