వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండండి. గ్యాస్, పెట్రో ధరలు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా పెరిగిపోతున్న నేపథ్యాన కేంద్రం మరోసారి తన మార్కు ఝలక్ ఇవ్వడం ఖాయం అని తేలిపోయింది. దీంతో జూన్ నెల ఆరంభమే ధరల పెంపుతో వినియోగదారులకు కాస్త భారంగా ఉండనుంది. సామాన్య కుటుంబాలకు ఇదొక పెద్ద ధరాఘాతమే! గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ మరో యాభై రూపాయలు పెరిగే అవకాశం ఉంది. యాభై కాదు యాభై రూపాయలకు పైగానే పెంచి కేంద్రం డబ్బులు పించుకోనుంది అన్న వార్తలు వస్తున్నాయి. అంటే ఈ జూన్ నుంచి డొమెస్టిక్ సిలిండర్ ఇంకాస్త పెరిగి, సామాన్యుడి నడ్డి విరగొట్టడం ఖాయం. తాము ఏం చేసినా దేశం కోసం ఏం చెప్పినా అది ధర్మం కోసం అని బీజేపీ నేతలు చెప్పుకుంటారే.. ఆ కోవలో ఆ తోవలో ఇప్పుడు సామాన్యులు సర్దుకుపోవాలి.
ఒక్క మే నెలలో 53 రూపాయలకు పైగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పెరిగిపోయింది. ఆ భయం నుంచి ఆ ఉద్వేగం నుంచి కోలుకోక మునుపే మళ్లీ గ్యాస్ ధర పెరిగి వినియోగదారులకు సవాల్ గా నిలవనుంది. ప్రతినెలా ఇదేవిధంగా బహిరంగ మార్కెట్లో అత్యవసరంగా భావించే సిలిండర్ ధరలు కానీ పెట్రో ధరలు కానీ పెంచుకుని పోవడంలో కేంద్రం బాగానే జోరు మీదుంది. మరి! సామాన్యుడి తిరుగుబాటును రేపటి వేళ తట్టుకోగలరా?
ఇప్పటికే పలు మార్లు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్న కేంద్రం ఈ సారి మళ్లీ అందుకు సిద్ధం అవుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. కేంద్రం నుంచి దీనిపై క్లారిఫికేషన్ ఇంకా రాకున్నా జూన్ ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరగడం ఖాయం. తాజా వివరం ప్రకారం గ్యాస్ సిలిండర్ ధర 1100 దాట వచ్చని తెలుస్తోంది. ఇది డొమెస్టిక్ కు సంబంధించి.. అందుతున్న వివరం.. మరి కమర్షియల్ సిలిండర్ ధర ను ఏ పాటి పెంచుతారో ?
ఒకటో తారీఖు అంటే ఏవో అప్పులు, ఈఎంఐలే కాదు ఒకటో తారీఖు అంటే ధరల పెంపుదలలు, ఇష్టారాజ్యంగా పన్నుల వసూళ్లు ఇవి కూడా గుర్తించాలి. లెక్కవేయాలి. లేదంటే కష్టమే ! ప్రభుత్వాలకు..! ఆదాయం వచ్చే మార్గాలను ఎన్ని సార్లు అన్వేషిస్తున్నా పాపం మళ్లీ మళ్లీ ఆ పెట్రో ధరల దగ్గరకు, ఆ గ్యాస్ సిలిండర్ ధరల దగ్గరకు వచ్చి ఆగుతారే కానీ కనీసం సామాన్యుడి కోసం కాస్తైనా ఆలోచించరే !