బ్యూటీ పార్లర్‌లో ఎన్నో సౌందర్య సాధనాలు ఉంటాయి.. ఎలాంటి మనిషిని అయినా అందంగా తీర్చిదిద్దగల సత్తా వాటికి ఉంటుంది. చాలామంది బ్యూటీపార్లర్‌లో హెయిర్ వాష్ చేయించుకుంటారు. జుట్టుకు ఎలాంటి సమస్యలున్నా..ఇలా తరచూ చేయించుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అయితే ఈ సౌందర్య చికిత్స వల్ల కొంతమందిలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు. ఇంతకీ ఏంటీ సమస్య? ఎందుకొస్తుంది?
ఏంటీ సిండ్రోమ్?
సాధారణంగా పార్లర్లో హెయిర్ వాష్ చేయించుకునే క్రమంలో మెడను బాగా వెనక్కి వంచుతాం. దీంతో కొన్నిసార్లు మెడకు సరైన సపోర్ట్ కూడా ఉండదు. ఇలా మెడను ఎక్కువగా సాగదీయడం, అలానే ఎక్కువ సేపు ఉంచటం వల్ల మెడపై వ్యతిరేక దిశలో ఒత్తిడి పడడం, షాంపూ/కండిషనింగ్ చేసే క్రమంలో మెడ కిందికి, పైకి వెంటవెంటనే కదులుతూ దాని సపోర్ట్‌కి తాకడం జరుగుతుంది. ఈ ప్రక్రియల వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. అలాగే మెదడు, వెన్నెముకకు రక్తాన్ని సరఫరా చేసే మెడలోని వెన్నుపూస ధమనుల పనితీరుకూ అంతరాయం ఏర్పడుతుందట. ఈ ఒత్తిడి వల్ల మెడ వద్ద ఉన్న రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. తద్వారా ఆ మార్గంలో రక్తం గడ్డకట్టి.. ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.. దీన్నే ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’గా పిలుస్తున్నారు.
లక్షణాలు
బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్‌లో అలసట, వికారం, వాంతులు, మైగ్రెయిన్ తరహా తలనొప్పి, చూపు మందగించడం, మెడ వద్ద వాపు, రుచిలో మార్పు.. వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముందుగా ఈ లక్షణాల్ని గుర్తించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే.. సకాలంలో చికిత్స తీసుకోవచ్చు.. తద్వారా స్ట్రోక్ రాకుండా, ఇతర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి..పార్లర్స్‌లో హెయిర్ వాష్ చేయించుకునేప్పుడు మెడకు వీలైనంత సపోర్ట్ ఇచ్చేలా చూసుకోండి. మధ్య మధ్యలో యథాస్థితికి వచ్చి మళ్లీ స్టాట్ చేయండి.! డెంటల్ ట్రీట్మెంల్లో కూడా మెడను బాగా వంచాల్సి వస్తుంది. అప్పుడు కూడా సరిగ్గా సపోర్ట్ ఇవ్వాలి..!