హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంపీ పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయనుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుక్కలను పట్టుకోవడానికి వెళ్లిన సందర్భంలో ఆ ప్రాంతం కార్పొరేటర్ సంతకం, ధ్రువీకరణ చేయాలని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఏటా కుక్కల గణన చేయనున్నట్లు వెల్లడించారు. వీధికుక్కలను పెంచుకోవడానికి ముందుకు వచ్చినవారికి ఉచిత లైసెన్సు, రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
వీధి కుక్కల నియంత్రణకు, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కోసం.. ఇప్పటికే జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. కుక్కలను పట్టుకోవడానికి ప్రస్తుతమున్న 30 వాహనాలకు అదనంగా మరో 20 వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వాహనానికి ఐదుగురు సిబ్బందిని.. ఔట్ సోర్సింగ్ పద్థతిలో నియమించనున్నారు. నూతన పరిజ్ఞానంతో..రోజుకు 400 నుంచి 450 కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యర్ధాలను కూడా వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.