దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. గత అక్టోబర్ నెల తరువాత మళ్లీ ఇప్పుడే భారీ స్థాయిలో రోజూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత ఆదివారం ఒక్క రోజే 291 మంది చనిపోయారు. అక్టోబర్ తరువాత మళ్లీ ఇప్పుడే ఇంతటి భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద కొత్తగా 68,020 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సెకండ్ ప్రభావం కొనసాగుతుండడంతో ప్రజలు కనీస జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే ప్రజలు తప్పకుండా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. బయటకు మీరు వెళ్లాలనుకునే ప్రదేశంలో ప్రజలు ఎప్పుడు తక్కువగా ఉంటారో అప్పుడు, ఆ సమయం తెలుసుకుని వెళితే మంచిది. దీంతో సామాజిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండవచ్చు. కోవిడ్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే 60 శాతం ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్‌ను కచ్చితంగా ఉపయోగించాలి.
బయటకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మాస్క్ ధరించాలి. మనిషికి మనిషికి మధ్య కనీసం 1 మీటర్ దూరం ఉండేలా చూసుకోవాలి. బయట ఉన్నప్పుడు కళ్లు, ముక్కు, నోరులను తాకరాదు. మాస్క్‌ను కూడా టచ్ చేయరాదు. తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలి. లేదా సబ్బు, హ్యాండ్ వాష్‌ను ఉపయోగించాలి. బయట ఆహారం తినేటప్పుడు మీ ఇంట్లో నుంచే ప్లేట్లను తీసుకెళ్లడం ఉత్తమం. ఇంటికి వచ్చిన తరువాత చేతులను సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి. ఈ కనీస జాగ్రత్తలను పాటించడం వల్ల కోవిడ్ ఇన్‌ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు.