జగన్ కు బంగారంలాంటి గుడ్ న్యూస్..!

-

కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇసుక తుపాను కమ్మేసింది. రాష్ట్రంలో ఇసుక బంగారమైపోయిందంటూ ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఇసుక లేక.. ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అటు తెలుగు దేశం, ఇటు జనసేన, ఇంకోవైపు బీజేపీ అన్నీ ఈ ఇసుక సమస్యపై తమదైన శైలిలో పోరాటం చేస్తున్నాయి.

ఇది వర్షా కాలం.. అందులోనూ నదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. అందుకే ఇసుక సరఫరా తగ్గింది అని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ వాదన వినిపించుకునే వారు లేరు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయితే ఏకంగా ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. రెండు వారాల్లో పరిస్థితి చక్కదిద్దాలన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ కు బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ వచ్చింది. అదేమిటంటే.. ఇసుక సరఫరా క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టన్నులకు చేరుకుంది. దీంతో ఇసుక కొరత దాదాపు తగ్గే పరిస్థితి ఏర్పడుతోంది. రీచ్‌లలో నీరు పూర్తిగా ఇంకిపోతే ప్రజలు కోరినంత ఇసుకను స్టాక్‌ యార్డుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈనెల 1వ తేదీన 31,576 మెట్రిక్‌ టన్నుల ఇసుక మాత్రమే రీచ్‌ల నుంచి స్టాక్‌ యార్డులకు చేరింది. శుక్రవారం ఇది 96,600 టన్నులకు పెరిగింది. అంటే.. ఐదు రోజుల్లో మూడు రెట్లు అధికంగా ఇసుక లభించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సుమారు 4 లక్షల టన్నుల ఇసుకను ఏపీ ఎండీసీ స్టాక్‌ యార్డులకు చేరవేసిందని అధికారులు చెబుతున్నారు. అంటే జగన్ కు ఇసుక కష్టాలు త్వరలో తీరిపోతున్నాయన్నమాటేగా..!

Read more RELATED
Recommended to you

Latest news