ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పాఠశాల భవనాల మర మత్తులు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు సమగ్ర శిక్ష అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఏకంగా 867 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
అయితే ఇందులో 823 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వివరించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. దేశంలో లక్ష ఇరవై వేల ఐసీటీ ల్యాబ్లు, 82 వేల స్మార్ట్ తరగతి గదులు అలాగే ఉపాధ్యాయులకు 14 లక్షల ట్యాబ్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి మరింత నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కేంద్రమంత్రి స్పష్టం చేశారు.