తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం త్వరలో దరఖాస్తులు స్వీకరించనుంది. తొలి విడత లబ్ధిదారులను ఎంపిక చేసి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గాల వారీగా సహాయం పంపిణీ చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కనీసం లక్షన్నర కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమావేశమయ్యారు. నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల తదితర బీసీ కుల వృత్తిదారులను ఈ పథకంలో చేర్చాలని ప్రతిపాదించారు. వారికి మెరుగైన ఉపాధికి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.