ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార వ్యూహంతో శ్రీలంక దేశ అధ్యక్షుడిగా… గోటబయ రాజపక్స విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే… శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం మొదలయింది… ఈ ఓట్ల లెక్కింపులో మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స సోదరుడు అయిన గోటబయ రాజపక్స విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన 53-54 శాతం ఓట్లు దక్కించుకున్నారని శ్రీలంక ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై ఆయన ఈ విజయం సాధించారు.
సజిత్ ప్రేమదాసకు 39.67 శాతం ఓట్లు రాగా, లెఫ్టిస్ట్ అనుర కుమార దిస్సానాయకె 4.69 శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆయన విజయం సాధించినట్టు ఎస్ఎల్‌పీపీ, యూఎన్‌పీలు అధికారికంగా ప్రకటించాయి. ఓట్ల లెక్కింపులో ప్రతీ దశలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు రాజపక్స. 70 ఏళ్ల రాజపక్స రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల కోసం ఆయన తనకు ఉన్న అమెరికా పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడానికి అమెరికా కూడా సహకరించిందని పలువురు అంటున్నారు.
ఇదిలా ఉంటె ఈ ఎన్నికల్లో రాజపక్స అనుసరించిన ప్రచార వ్యూహమే ఆయన్ను విజయం దిశగా నడిపించిందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నిక కావడానికి జాతీయ వాదంతో పాటు హిందుత్వం కూడా ఎంతో సహకరించింది. దేశ భక్తిని చాటుకునే విధంగా మోడీ ప్రసంగాలు ఎక్కువగా ఉండేవి… దీనిని గమనించిన రాజపక్స అదే విధంగా ఎన్నికల ప్రచారం చేశారు. సింహళీయులు, జాతీయతావాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవడంతో మెజారిటీగా ఉన్న సింహళీయుల ఓట్లు ఆయనకు భారీగా పడ్డాయని తెలుస్తుంది. మైనారిటీ గా ఉన్న తమిళులు, ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని సమాచారం. ఆయన విజయం సాధించడంపై మోడీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.