ఇక్కడ బాబుకి మద్దతుగానో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు గాని… ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్న టీడీపీ నేతల్లో ఎక్కువగా భయమే కనపడుతోంది. తమ ఆస్తులను కాపాడుకోవడానికో లేక కేసుల నుంచి తప్పుకోవడానికో వాళ్ళు వైసీపీలోకి వెళ్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణం ఆయన మీద ఉన్న కేసులే. ఇకపోతే… దేవినేని అవినాష్ కు తమ అనుచరుల మీద ఉన్న కేసులు, కొన్ని భూ వివాదాల కారణంగానే ఆయన పార్టీ మారారు అనే విషయం స్పష్టంగా జనాలకు అర్ధమైంది. ఇక్కడ ఇద్దరు కూడా జగన్ కుభయపడ్డారన్న చర్చలే ప్రధానంగా నడుస్తున్నాయి.
వాస్తవంగా మాట్లాడితే చంద్రబాబుది చూసి చూడనట్టు పోయే మనస్తత్వం. రాజకీయంగా ఆయన ఇబ్బందులు వచ్చినా సరే, ఇబ్బందులు పెట్టినా సరే భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగపడవచ్చు అనే భావనలో ఉంటారు. అందుకే విమర్శించినా అమరనాథ్ రెడ్డిని, భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఆదినారాయణ రెడ్డి వంటి వారికి ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో జగన్ ని హత్తుకున్నా పెద్దగా చంద్రబాబు స్పందించలేదు. కానీ జగన్ విషయంలో అలా ఉండదు… తనను విమర్శించినా వాళ్ళ విషయంలో ఆయన కఠినంగా ఉంటారు.
అందుకే ధర్మాన ప్రసాదరావు వంటి వాళ్లకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. నేతలను భయపెట్టి పార్టీలోకి తీసుకుంటున్నారన్న టాపిక్కే ఇప్పుడు హైలెట్ అవుతోంది. త్వరలో ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా జగన్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ దూకుడు తట్టుకోలేక ఏదొక పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు దీనినే తట్టుకోలేకపోతున్నారని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
అసలు జగన్ కు ఉన్న ధైర్యం ఏంటి…? ఆయన మీద కేసులు ఉన్నా సరే తన పార్టీ నేతలను ఏ మాత్రం భయపడకుండా… భయపెడుతూ పార్టీలోకి తీసుకుంటున్నారు… ప్రభుత్వ నిర్ణయాలు కూడా జగన్ అదే దూకుడుగా తీసుకుంటున్నారు. తన 40 ఏళ్ళ అనుభవంలో జగన్ లాంటి దూకుడు ఉన్న నేతను చూడలేదని పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు ముందున్న ప్రశ్న… జగన్ దూకుడు, ధైర్యానికి కారణం ఏంటి…? ఈ ప్రశ్నకు ఆయన ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆన్సర్ దొరకడం లేదట.