తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయింట్‌మెంట్ లభించింది. ఇవాళ సాయంత్రం 5గంటలకు ఆమెకు రాజ్‌భవన్ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు విషయంలో తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేయాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి, అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్ లేఖ రాశారు. ఆ లేఖకు అనుగుణంగా గవర్నర్‌ను కలిసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు రాజ్‌భవన్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చింది.
సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తోన్న గవర్నర్ ఆ పర్యటన అనంతరం వీరబైరాన్‌పల్లి మీదుగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో చేర్యాల వద్ద ఓ పారిశుద్ధ్య కార్మికురాలు సంధ్యారాణి గవర్నర్ కారుకు అడ్డుతగిలారు. తన ఇల్లు కూలిపోయిందని న్యాయం చేయాలని తమిళిసైని వేడుకున్నారు. కార్మికురాలి ఇంటికి వెళ్లిన తమిళిసై.. ఆమె ఇంటిని పరిశీలించి సంధ్యారాణి ఆధార్ కార్డు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.