రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు.. అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ తమిళిసై

-

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. రాజ్‌ భవన్‌లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్‌ తమిలిసై సౌందరరాజన్‌ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని రాజ్‌భవన్ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. అదే విధంగా వర్షబీభత్సం నుంచి భాగ్యనగర ప్రజలతో పాటు రాష్ట్రాన్ని కాపాడాలని వేడుకుంటున్నట్లు చెప్పారు.

తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక అని గవర్నర్ అన్నారు. ఆషాఢ, శ్రావణ మాసంలో ఇక్కడి ప్రజలు బోనాల ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు. ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు వరణుడు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న దృష్ట్యా వరదల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news