విజయవాడ-హైదరాబాద్ రూట్లో ప్రైవేట్ బస్సులకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలపై తెలంగాణ ప్రభుత్వంతో అంతరాష్ట్ర ఒప్పందం వ్యవహరం కొలిక్కి రాకపోవడంతో ప్రైవేట్ బస్సులకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రైవేట్ ట్యాక్సీల దోపిడీ ఎక్కువ కావడంతో ప్రైవేట్ బస్సులు తిరగడానికి అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. బస్సులు నడపాలనుకునే ప్రైవేట్ బస్ ఆపరేటర్లు వెంటనే సంబంధిత పన్నులు చెల్లించి క్లియరెన్స్ తీసుకోవాలని రవాణ శాఖ సూచనలు చేసింది.
పన్నుల చెల్లింపు విషయంలో బస్సులు తిప్పని ఆపరేటర్లకు ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. అయితే నిజానికి ఇప్పటికే ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ అంటే రెడ్ బస్ లాంటి వాటి ద్వారా ఆపరేటర్లు మొదలుపెట్టారు. పరిస్థితిని బట్టి సర్వీసుల్ని పెంచేందుకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ రెడీగా ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్, వీలైనంత వరకు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.