హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ ముఖచిత్రాన్ని మార్చిన ఉప్పల్‌ భగాయత్‌

-

నగర శివార్లతో, కాలుష్యం బారిన పడకుండా, స్వచ్చమైన గాలి, వెలుతురు లభించేలా ఉండే నివాసాలకు నేడు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ దానికి సరిగ్గా సరిపోతుంది కాబట్టే వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి.

హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ – హెచ్‌ఎండిఎ. రైతులనుంచి భూములను తీసుకుని ఒక మంచి వెంచర్‌గా అభివృద్ధి చేసి, వారికిచ్చేది ఇచ్చేసి మిగిలినవి అమ్మేసుకునడమనే ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇంతకుముందు, కూకట్‌పల్లి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌..ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ ప్లాట్లను వేలం వేసినా, ఉప్పల్‌ భగాయత్‌ ఆకర్షించినట్లుగా అవి వర్కవుట్‌ కాలేదు. గజానికి 80వేలంటే నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఉప్పల్‌ భగాయత్‌, రింగ్‌రోడ్డుకు కూతవేటు దూరంలో, మూసీనదిన ఆనుకుని, మెట్రో రైల్వేస్ఠేషన్‌కు సరిగ్గా ఎదురుగా ఉన్న హెచ్‌ఎండిఎ లేఅవుట్‌. నివాసాలకు సరిపోయే ప్లాట్ల దగ్గర నుండి, కమర్షియల్‌ కాంప్లెక్సు వరకు అన్ని రకాల నిర్మాణాలకు అనువుగా ఉన్న పెద్ద వెంచర్‌. విశాలమైన రోడ్లు, నది వెంబడి ఆహ్లాదకరమైన పచ్చదనం, వాకింగ్‌ ట్రాక్‌లతో, అండర్‌గ్రౌండ్‌ డ్రయినేజీ, వాటర్‌ సప్లయిలతో బ్రహ్యాండంగా డిజైన్‌ చేసారు. అప్పటి కమిషనర్‌ చిరంజీవులు సారథ్యంలో బహుముఖ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడింది.

410 ఎకరాలతో ఉన్న తూర్పు బ్లాక్‌ను ఫేజ్‌-1గా, 70 ఎకరాలతో ఉన్న పశ్చిమ బ్లాక్‌ను ఫేజ్‌-2 గా నిర్ణయించి అభివృద్ది చేసారు. పశ్చిమ బ్లాక్‌ను వాణిజ్యపరమైన అవసరాల కోసం తీర్చిదిద్దారు. అది ఇదివరకే వేలం వేయబడింది. దాని పక్కనే శిల్పారామం ఈ మధ్యనే ప్రారంభమయింది. త్వరలో అక్కడే హైటెక్స్‌ తరహాలో ఒక భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో హెచ్‌ఎండిఏ ఉంది. ఇక తూర్పు బ్లాకు, అన్నింటికీ అనుకూలంగా తయారుచేసారు. వాణిజ్య సముదాయాలతో పాటు బ్రహ్మాండమైన నివాస సముదాయాలను కూడా ప్లాన్‌ చేసారు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ సబ్‌-స్టేషన్‌, భారీ వాటర్‌ ట్యాంక్‌, వీధి దీపాలు, అండర్‌గ్రౌండ్‌ వాటర్‌, డ్రయినేజీ వ్యవస్థలను నెలకొల్పారు. అందమైన ముఖద్వారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఒక రకంగా ఈస్ట్‌ బ్లాక్‌ను హెచ్‌ఎండిఎ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేరొందిన వెంచర్‌ డెవలపర్లు, తమ వెంచర్లను అత్యాధునికంగా ఎలా అభివృద్ధి చేస్తారో, అదే విధంగా ఈ ఫేజ్‌-1ను కూడా రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమమే అయినా, అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేసి, ఒక మినీ నగరాన్ని అక్కడ నిర్మించారు. ఇంకా కొన్ని సౌలభ్యాలను అందుబాటులోకి తెస్తే, నగరంలోని అన్ని వెంచర్ల కన్నా అద్భుతంగా పేరు తెచ్చే లేఅవుట్‌ అవుతుంది.

అయితే, అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌ వ్యవస్థ లేకపోవడం పెద్ద మైనస్‌గా ఉంది. అన్ని రకాలుగా అత్యాధునికంగా ఉన్న ఈస్ట్‌ బ్లాక్‌, ఇంకా పోల్‌ టు పోల్‌ తీగలతో ఉండటం ప్లాట్ల యజమానులతో పాటు చూసేవారికి కూడా కొంత అసంతృప్తిని కలిగిస్తోంది. అలాగే ఈ తూర్పు బ్లాక్‌కు ‘‘ఈస్ట్‌ సిటీ’’ అన్న పేరు పెడితే సార్థక నామధేయంగా మిగిలిపోతుందని చాలామంది యజమానులు, అధికారుల నిశ్చితాభిప్రాయం. పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌కు కూడా ఇది ఎనలేని ప్రీతిపాత్రం కాబట్టి, ఆయన పాలసీ, ‘లుక్‌ ఈస్ట్‌’ కు కూడా ఈ పేరు గట్టి మద్దతుగా నిలబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news