ఈ మధ్య భారతీయ కుర్తను లక్షల్లో విక్రయించి సోషల్ మీడియాలో సైతం వైరల్ అయిన గుస్సీ.. ఇప్పుడు మరో వివాదంతో విమర్శల పాలవుతోంది. క్రోక్సా కంపెనీకి చెందిన రబ్బర్ షూలను రూ. 40 వేలకు విక్రయానికి పెట్టింది. దీంతో మరోసారి నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆ సంస్థ నిర్ణయించిన ధరను చూసి నెట్టింట్లో అవాక్కులు చవాక్కులు గుప్పిస్తున్నారు. గుస్సి ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్. కానీ, ఈ సంస్థ ఇటీవల చేస్తోన్న ప్రకటనలు చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వస్తువుల నాణ్యతకు పొంతనలేని ధరలను నిర్ణయిస్తూ విమర్శలపాలవుతోంది.
తాజాగా క్రోక్సా కంపెనీ రబ్బర్ చెప్పులను కూడా పొంతనలేని ధరకు విక్రయానికి పెట్టింది. అసలు ఆ సంస్థ ఇంత భారీ రేట్లు నిర్ణయిస్తూ ఎందుకు చే స్తుందో తెలియడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో కంపెనీ అసలు ఏ ప్రాతిపదికన ఇంతటి భారీ రేట్లు నిర్ణయిస్తుంది? నిజంగా వీటి తయారీకి అంత ఖర్చవుతుందా? అసలు ఇంత ధర పెట్టి కొనే వారు కూడా ఉంటారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రోక్స్ షూస్ భారత మార్కెట్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే, భారత మార్కెట్లో వీటికి ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని అలాంటి షూస్నే విడుదల చేసి విక్రయాలు చేపట్టింది. పురుషులు, స్త్రీలకు మూడేసి రంగుల్లో కొత్త రబ్బర్ షూస్ను లాంచ్ చేసింది. ఈ రబ్బరు బూట్ల ధర విషయానికి వస్తే.. పురుషులకు 420 డాలర్లు (సుమారు రూ .30,660), మహిళలకు 470 డాలర్లు (సుమారు రూ.34,000)గా నిర్ణయించింది. కంపెనీ పేరు తెలిసేలా వీటిపై జీజీ అనే లోగోను ముద్రించారు. లగ్జరీ బ్రాండ్గా పేరొందిన గుస్సీ ఇటీవల ‘కుర్తా’ను రూ .2 లక్షలకు ధర నిర్ణయించి విక్రయానికి పెట్టిన సంగతి తెలిసిందే. పూల ఎంబ్రాయిడరీతో తయారైన ఈ కుర్తాను డిజైన్ను బట్టి 2,100 డాలర్లు (రూ .1.5 లక్షలు) నుంచి 3,500 డాలర్లు (రూ .2.5 లక్షలు) మధ్య అమ్మకానికి పెట్టింది. సాధారణంగా బహిరంగ మార్కెట్లో రూ.1000 – రూ.2000 మధ్య లభిస్తుంది.