జనసేప పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను పవన్ కల్యాణ ఇవాళ పరిశీలించారు. అనంతరం జనసేనాని మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర దోపిడీ ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం ఈ ఎర్రమట్టి దిబ్బలు అని, దాదాపు 20వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ప్రాంతమని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. టూరిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, తాను ఈ విషయాన్ని కేంద్రపర్యావరణ శాఖ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
పవన్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఎర్రమట్టి దిబ్బల్లో ఏదో జరిగిపోతోందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి పవన్ కల్యాణ్ బొక్క బోర్లా పడ్డారన్నారు. ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతొందని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నేను చెప్పినట్టు చేయకపోతే మోడీకి చెబుతాను, డాడీకి చెబుతాను అంటూ పవన్ కల్యాణ్ పిల్ల చేష్టలు ప్రదర్శిస్తున్నారని ఆయన హెద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక అంశాలపై స్పందిస్తే బాగుంటుందన్నారు.