అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా ఆజిల్లా నేతల్లో మార్పు లేదా…!

గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయాలు ఎప్పుడు హాట్‌ హాట్‌గా ఉంటాయి. ఏదో ఒక అంశంలో ఎంపీలో.. ఎమ్మెల్యేలో ఎవరో ఒకరు చర్చల్లో ఉంటారు. ఎంపీలంటే ఎమ్మెల్యేలకు పడదు.. ఎమ్మెల్యేల పెత్తనం ఎంపీలకు రుచించదు. ఇలాంటి విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని పార్టీ పెద్దలు చొరవ తీసుకున్నా.. నాయకుల్లో మార్పు రావడం లేదని వైసీపీలో వినిపించే టాక్‌.

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పరిధిలోని ఎమ్మెల్యేలు ఆయనతో టచ్‌మీ నాట్‌ అంటున్నవారే ఎక్కువగా ఉన్నారు. ప్రొటోకాల్‌లో భాగంగా పిలవడం తప్పితే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసిసాగే పరిస్థితి లేదు. పల్నాడు ప్రాంతంగా నరసరావుపేట కొత్త జిల్లా ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యేల మాటలకే పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో ఎంపీ అసంతృప్తిగా ఉన్నారట. ఇదే సమయంలో నరసరావుపేట కాకుండా గురజాలను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌ తెరపైకి రావడం వెనక ఎంపీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలతో ఎంపీ కృష్ణదేవరాయులు దూరంగానే ఉంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏం జరిగినా ఎంపీని ఆహ్వానించడం లేదట. ప్రొటోకాల్‌లో భాగంగా పిలిస్తే.. ఎంపీ వెళ్లి నిలబడే పరిస్థితి ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యే రజని వర్గమైతే ఒకానొక సమయంలో ఎంపీపై కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక్క పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావుతో మాత్రమే ఎంపీ స్నేహంగా ఉంటున్నారట. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిలు అవసరం ఉంటే ఎంపీతో మాట్లాడటం లేదంటే లేదు అన్నట్టు ఉందట.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ పరిధిలో గుంటూరు జిల్లాలో రేపల్లె, తెనాలి, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ సురేష్‌ ముద్ర అంతంత మాత్రమేనని పార్టీ వర్గాల టాక్‌. ఆయన ఎక్కువగా తాడికొండ నియోజకవర్గంలోనే ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో తరచు వివాదాలు, ఇసుక దుమారం చుట్టుముట్టడంతో లోకల్‌ వైసీపీ కేడర్‌ కూడా రెండుగా విడిపోయారట. ఎవరి దగ్గరకు వెళ్లితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్న ఈ గ్యాప్‌పై పార్టీ పెద్దలు కూడా పలుమార్లు ఫోకస్ పెట్టి వార్నింగ్ లు ఇచ్చినా వీరిలో మాత్రం ఏ మార్పు కనిపించడంలేదు.