ఆందోల్ లోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో శనివారం నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన సుమారు 300 మందికి బీసీ బంధు చెక్కులు, సింగూరు ప్రాజెక్ట్ 123 మంది ముంపు బాధితులకు ఇళ్ల పట్టాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో ప్రజా రంజక సంక్షేమ పాలన సాగుతోందని అన్నారు. తెలంగాణ ముచ్చటగా మూడోసారి హ్యట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మరోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారని అన్నారు.
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతుబంధు, బీసీ బంధు, ఉచిత కరెంట్ వంటి పథకాలు ప్రజలకు దూరం అవుతాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓటును బీఆర్ఎస్ కే వేయాలన్నారు. గతంలో కంటే ప్రభుత్వాసుపత్రుల్లో గణనీయంగా ప్రసవాలు పెరిగాయని గుర్తు చేశారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే అందోల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. గత పాలకులు ఎవరూ కుల వృత్తులను ప్రోత్సహించలేదన్నారు. కేసీఆర్ కుల వృత్తుల వారి బాధలను గుర్తించి వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక చేయాలని నిర్ణయించారని తెలిపారు.