సివిల్స్ విజేతలకు శాలువా కప్పి సత్కరించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. దేశం మెచ్చే విధంగా తెలంగాణ గర్వించేలా సేవలు అందించాలని ఆకాంక్షించారు.మీ గెలుపు ఎంతో మందికి ఆదర్శమని, యువతకు మీ విజయం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. యూపీఎస్సీ-2021 లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు సుధీర్ రెడ్డి, స్నేహ, చైతన్య రెడ్డి, రంజిత్ కుమార్,స్మరణ రెడ్డి తో సహా సివిల్స్ సబ్జెక్టు నిపుణురాలు,మెంటర్ బాలలత గారు బుధవారం కోకాపేటలోని హరీష్ నివాసంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సన్మానించారు మంత్రి హరీష్ రావు.
అనంతరం వారితో కలిసి అల్పాహార విందులో పాల్గొనడం జరిగింది. ఎంతో కష్టపడి దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీస్ చేరుకోవడం గొప్ప విషయమని, తెలంగాణ గర్వించేలా, దేశం మెచ్చేలా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు హరీష్ రావు. బాల లత గారి లాంటి మెంటర్ సలహాలు, సూచనల వల్ల విజయావకాశాలు మరింత చేరువ అవుతాయన్నారు. పోలియో మహమ్మారి రూపంలో వైకల్యం కలిగినా, గెలుపు మీద కసితో రెండుసార్లు సివిల్స్ ర్యాంకు సాధించడం గొప్ప విషయమని బాలలత గారికి అభినందనలు తెలిపారు.