బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చింది ఉత్తర ప్రదేశ్ కు చెందిన శివంగి గోయల్. అమ్మానాన్నలకు నోట మాట రాలేదు. చదువు, ప్రతిభ, సాధన అన్నవి ప్రధాన మార్గాలుగా ఉన్నప్పుడు తప్పులూ ఒప్పులూ అన్నవి ఏంటన్నవి తెలుసుకునే వీలు ఎక్కువగా ఉంటుంది. కెరియర్ లో సాధించాలనుకున్నవి కేవలం కొన్ని కారణాల రీత్యా ఆగిపోవడంలో అర్థం లేదు. ఆగిపోవడం అర్థం లేని పని అయితే అందుకు తగ్గ కారణాలు వల్లెవేయడం చేతగాని పని. ఆగిపోవడం అన్నది బాధ్యతారాహిత్యం. అకారణ యుద్ధాలు వద్దు కానీ కాలంతో పాటు చేసే పరుగు మాత్రం గమ్యాలను చేర్చేందుకు తప్పక ఉపయోగపడాలి. ఆ విధంగా శివంగి గోయల్ సివిల్స్ విజేతగా నిలిచి ఇవాళ ఎందరికో స్ఫూర్తి రేఖ అయ్యారు. ఆ గీతల కొనసాగింపే ముందరి జీవితం. కనుక అమ్మాయిలూ ! అందం అయిన జీవితం అంటే చీకటిని జయించేందుకు సహకరించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకుని ప్రయాణించడం అని అర్థం .. తెలుసుకోండిక !
పెళ్లి జీవితాన్ని ఆపదు.. వెలుగును ఆపదు.. ఆపాలనుకున్నా అది కుదరని పని. విశిష్టం అయిన పనులకు వివాహం అడ్డు కాదు. కానీ ఆమెకు పెళ్లే శాపం అయింది. వివాహం అనంతరం జీవితం నిరాశలకు ఆనవాలు అయింది. వివాహానికి ముందు కూడా ఆమె లక్ష్యం సివిల్స్ సాధించాలనే ! కానీ అది సాధ్యం కాలేదు. తరువాత అయినా ప్రయత్నించి సాధిద్దాం అనుకుంటే కుదరని పనిలా మారిపోయింది. నిత్యం వేధింపుల పర్వం దాటుకుని చదువుల పరుగుల్లో విజయం సాధించడం సులువు కాదు. ఆమె మాత్రం ఓ కఠిన నిర్ణయం తీసుకుని జీవితం ఇచ్చిన కొన్ని ఒత్తిళ్లనూ సవాళ్లనూ అధిగమించి ఇవాళ మన ముంగిట విజేత అయ్యారు. బాధితులంతా తమని తాము నిరూపించే క్రమం ఒకటి ఉంటుంది. బాధితులకు లోకం తొలుత గుర్తింపు ఇవ్వదు.
గెలిచాక నెత్తిన పెట్టుకుని ఊరేగే సందర్భాలే ఇవి.
ప్రతిసారీ గమ్యాలే సవాళ్లను పంపిస్తాయి. ముళ్లే ఇవి కానీ నీవు దాటాలి అని ఆదేశిస్తాయి. సివిల్స్ విజేత 177 వ ర్యాంకు గ్రహీత శివంగి గోయల్ జీవితం ఇది.. ఈ ఉదయాన మీ కోసం. అసలు సిసలు పట్టుదలకు కారణాలు ఎన్నో ఉంటాయి. జీవితం ఎక్కడో దగ్గర ఆగిపొమ్మని ఆదేశిస్తుంది. ముందుకు వెళ్లడం బాధ్యత.. ఆగిపోవడం నైరాశ్య కారకం. నిరాశలు ఎన్ని ఉన్నా జీవితాన్ని ఆడ బిడ్డలు స్ఫూర్తిదాయకంగా మలిచిన సందర్భాలు మలినాలను వదిలించుకుని మంచి ఫలితాలను అందుకున్న సందర్భాలు ఆనందాలకు కారకాలు. మీరు మీ ఇంట ఇలాంటి విజేతలకు ప్రాధాన్యం ఇవ్వండి.
విజేతల కథలకు ప్రాధాన్యం ఇవ్వండి. చదివి తెలుసుకోవడం అనుభూతి. జీవితం నుంచి నేర్చుకోవడం బాధ్యత. బాధ్యత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్లనిస్తుంది. కడివెడు కన్నీళ్లు లేకుండా చేస్తుంది. అత్తింటి ఆరళ్ల నుంచి వేధింపుల నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి తరువాత కాలంలో విజేతగా నిలిచారు. అమ్మాయిలూ ! మీకు ఇలాంటి వారే ఆదర్శం కావాలి. అబ్బాయిలూ మీరు ఇలాంటి వారి వెంటే పరుగులు తీయాలి. కాలం కలిసి వస్తే పెద్దాళ్లం అవుతామా లేదు కదా ! కాలాన్ని శాసించిన గెలుపులే గొప్పవి. మీరు నేర్చుకోవాల్సినంత నేర్చుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలవండి.