వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ లో రైతులకు డిజిటల్ కార్డుల పంపిణీ, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు నిరంజన్ సంస్మరణ సభకు మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం కేసీఆర్ కొత్త పీఆర్సీ వేయనున్నారని తెలిపారు. దేశంలోనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రానికి రావల్సిన లక్ష కోట్లు రాలేదన్నారు. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రెసిడెన్షియల్ స్కూళ్లలో 6 లక్షల పై చిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. కొందరు ప్రైమరీ, జడ్పీ స్కూళ్ల సంఖ్య తగ్గిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంస్మరణ సభలో నిరంజన్ కుటుంబ సభ్యులకు రూ. 6 లక్షల సంక్షేమ నిధి చెక్ ను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, యూనియన్ బ్యాంక్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొ్న్నారు.