మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏడు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. త్వరలో చిరంజీవి సెట్లో ఎంటర్ కాబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత వెంటనే చిరు మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే.
వి.వి.వినాయక్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తారని అంతా ప్రచారం జరిగింది. చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ తాజా గా వినాయక్ ని మెగాస్టార్ తప్పించినట్టు తెలుస్తోంది. చిరు ఆశించిన స్థాయిలో మార్పులు చేర్పులు లేకపోవడం.. మేకింగ్ పరంగా కూడా వినాయక్ ఇంప్రెస్ చేయలేకపోవడంతో మెగా క్యాంప్ ఈ ప్రాజెక్ట్‌ని మరో దర్శకుడి చేతుల్లో పెట్టినట్టు తెలిసింది. ఆ దర్శకుడు మరెవరో కాదు హరీష్‌శంకర్.
చాలా కాలంగా మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు హరీశ్‌శంకర్. `గబ్బర్‌సింగ్`ని మలిచిన తీరు నచ్చడంతో చిరు `లూసీఫర్` రీమేక్‌ని హరీష్ శంకర్‌కు అప్పగించినట్టు తెలిసింది. పవన్‌కల్యాణ్ తో ఓ భారీ చిత్రాన్ని హరీష్‌శంకర్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే పవన్ `వకీల్‌సాబ్` పూర్తయిన వెంటనే మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ మూవీ పూర్తయ్యే వరకు హరీష్ శంకర్ ఖాలీగా వుండాల్సిన పరిస్థితి. దీంతో ఆ టైమ్‌ని `లూసీఫర్` రీమేక్ కు కేటాయించి చిరుని డైరెక్ట్ చేయబోతున్నారట.