అమెరికా ఎన్నికల పై హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆసక్తికర సర్వే…!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంటుండడంతో.. ట్రంప్‌, బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ తరుణంలో వస్తున్న కొన్ని సర్వేల్లో.. బైడెన్‌కే సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు యువత మద్దతు లభిస్తోంది. ఈ సారి ఎన్నికలపై యువత తెగ ఆసక్తి చూపుతున్నారని… అత్యధికులు డెమ్రోకటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కే జై కొట్టబోతున్నారని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ చేపట్టిన సర్వేలో తేలింది.

18-29 ఏళ్ల వయస్కులపై చేసిన ఈ సర్వేలో ఓటు వేయడంపై గత కొన్ని దశాబ్దాల్లో చూడనంత ఆసక్తి ఇప్పటి యువతలో కనిపించింది. 63 శాతం మంది యువత తాము తప్పక ఓటు వేస్తామని తెలిపారు. 2016 ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్న దానితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. యువ ఓటర్ల ఆదరణలో రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ కన్నా… డెమెక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ 24 పాయింట్ల ముందంజలో ఉన్నట్టు సర్వేలో తేలింది. 56 శాతం యువ ఓటర్లు బైడెన్‌ వైపే మొగ్గుచూపుతున్నారని స్పష్టం చేసింది.