సినీనటి జమున మృతిపట్ల హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం

-

సీనియర్ సినీ నటీమణి శ్రీమతి జమున గారి మృతిపట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీనియర్ సినీ నటీమణి శ్రీమతి జమున గారి మరణం చాలా బాధాకరమైన విషయమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

శ్రీమతి జమున గారు చలన చిత్ర రంగంలో తెలుగు, హిందీ మరియు దక్షిణాది భాషల్లో అనేక సినిమాల్లో నటించి, ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారని, వారు భారతీయ సంస్కృతీ సాంప్రదాయానికి మరియు తెలుగుతనానికి మూర్తీభవించిన మహిళా సినీ నటి అని, వారిలో వినయము, మర్యాద, గౌరవం, సౌశీల్యం, స్నేహభావం, సంస్కారం మూర్తీభవించేవని, వారి జీవితం మచ్చలేనిదని, మహిళలకు ఆదర్శంగా నిలిచేవారని బండారు దత్తాత్రేయ గారు కొనియాడారు.

శ్రీమతి జమున గారు 109 చలనచిత్రాల్లో నటించి, కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని, పార్లమెంట్ సభ్యురాలిగా పార్లమెంట్ లో ప్రజాసమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషిచేశారని, తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు శ్రీమతి జమున గారు ఢిల్లీ కి వచ్చి సినీ రంగం మరియు ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషిచేసేవారని, వారి మృతి సినీ లోకానికి మరియు తెలుగు ప్రజానీకానికి తీరని లోటు అని బండారు దత్తాత్రేయ వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీమతి జమున గారి మృతి పట్ల బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్టసమయాన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news