ఉక్రెయిన్ నాలుగు భూభాగాలను విలీనం చేసుకున్న తర్వాత కూడా రష్యా దాడుల తీవ్రత తగ్గలేదు. ఉక్రెయిన్‌కు గట్టి పట్టున్న జపోరిజియాలోని నివాసాలపై రాకెట్లతో మాస్కో భీకర దాడులకు పాల్పడింది. ఈ ధాటికి ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడ్డారు.
అక్కడికి సమీపంలోని యూరప్‌లోనే అతి పెద్దదైన అణు కార్మాగారం ఉంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. దొనెట్క్స్, ఖేర్సన్, నిప్రో ప్రాంతాల్లోనూ మాస్కో బలగాలు దాడులకు పాల్పడ్డాయని.. ఈ ఘటనల్లో పది మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ డిప్యూటీ చీఫ్ కైరి తిమోషెంకో వెల్లడించారు.
మరోవైపు.. అణ్వస్త్రాలను వినియోగించేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొట్టిపారేశారు. “అణు దాడి జరుగుతుందని చెప్పడం కష్టమే. రష్యాలో అన్నింటిపైనా పుతిన్‌కు సరైన నియంత్రణ లేదు. అణు దాడికి పాల్పడితే ఆయన మనుగడ సాగించలేరు. ప్రపంచ దేశాలు ఏ మాత్రం క్షమించవని పుతిన్‌కు బాగా తెలుసు” అని ఆయన పేర్కొన్నారు.