తెలంగాణతో పాటు ఏపీలో భారీవర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీవర్షాలు కురియడంతో తెలుగు రాష్ట్రాల జలశయాలకు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భయంకరంగా మారిన ప్రళయ గోదావరి వరద ఉధృతి ప్రజలపై విరుచుకుపడుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు భారీ వచ్చి చేరుతుండటంతో.. 20.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
ఈ క్రమంలో.. బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా 23 లక్షల 63 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. సాయంత్రంలోపు మరింతగా గోదావరి వరద ఉధృతి పెరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు.