చాలా రోజుల గ్యాప్ తర్వాత అకస్మాత్తుగా దంచికొట్టిన వానతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరమంతా జలమయమైంది. వరద నీరు చేరి రోడ్లన్ని చెరువుల్లా మారాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వాన నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు అవస్థలు పడ్డారు.
ముఖ్యంగా నగరంలోని మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో పెద్దఎత్తున వర్షం కురవడంతో వారాంతపు సంతలోని కూరగాయల తోపుడు బండ్లు కొట్టకుపోయాయి. అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, షేక్‌పేట, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ జల్లులు కురిసాయి.
మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట, సంతోష్‌నగర్, సరూర్ నగర్, చంపాపేట్ నార్సింగి, కాటేదాన్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ, ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.