రాష్ట్రంలో ఇవాళ, రేపు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులు తుడిచిపెట్టుకుపోయాయి. రాకపోకలు నిలిచి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భాగ్యనగరవాసులకు వరదలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాలనీల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో జోరు వర్షాలకు పలు కాలనీలు జలదిగ్బంధంలో మగ్గుతున్నాయి. వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షానికి…. గండిపేట, హిమాయత్‌సాగర్‌లకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీరు దిగువకు వదిలారు. ఒక్కసారిగా మూసీకి వరద పెరిగింది. గండిపేట్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. ఓ కుటుంబం వరదలో చిక్కుకుంది. తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయగా… స్థానికుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం వారిని సురక్షితంగా కాపాడారు. చిన్నారితో సహా ఐదుగురిని రక్షించారు.