తెలంగాణలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రజలంతా మరో ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. భాగ్యనగరంతో పాటు మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు అత్యవసర సమయాల్లో తప్పితే ప్రజలెవరూ బయటకు రావొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
మూడ్రోజులు బ్రేక్ ఇచ్చిన వరణుడు.. మళ్లీ విజృంభించడంతో ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుతోన్న జలాశయాలకు మళ్లీ వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలోని కుంటలు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి రహదారులపైకి నీరు చేరింది. దీనివల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా నదిలో ఒకరు గల్లంతయ్యారు. సూర్యాపేట జిల్లా పాలేరు వాగులో 14 మంది కూలీలు చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ బృందం వారిని రక్షించింది.
ఓవైపు ఎడతెరిపి లేని వర్షం.. మరోవైపు ఎగువ నుంచి వస్తోన్న వరదతో రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండుకుండలా మారాయి. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్‌నాలా జలాశయానికి భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టులోకి నిన్న రాత్రి 26,794 క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో అధికారులు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గానూ.. ప్రస్తుత నీటిమట్టం 457.90 మీటర్లు ఉంది.