తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాకాలం ముగిసినా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జలశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. అయితే.. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మేడిపల్లి, ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, కొత్తపేట, దిల్ షుఖ్ నగర్, నాగోలు, మలక్ పేట పరిసర ప్రాంతాల్లోనూ భారీగా వర్షం పడుతోంది. వీటితో పాటు.. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
ఇది వాయుగుండంగా మారుతోంది. ఎల్లుండి వరకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు వచ్చే రెండు రోజులు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత రెండు రోజులుగా గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాల తిరోగమన సమయంలో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బల్దియా అధికారులు అవసరం ఉంటే ప్రజలు బయటకు రావాలని హెచ్చరించారు.