గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి నదుల్లో నీటి మట్టం పెరిగిపోయి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీటి మట్టం పెరగడంతో 100కు పైగా రహదారులు మూసుకుపోయాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది పొంగి పొర్లుతుండటంతో 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది.
పౌరీ, నైనిటాల్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. గంగ, సరయూ ప్రమాదకర స్థాయికి కొన్ని మీటర్ల దిగువన ప్రవహిస్తుండగా, అలకనంద, మందాకిని, భాగీరథి నదులు ప్రమాద స్థాయిని దాటాయి. గోమతి, కాళీ, గౌరీ, శారదా నదుల నీటిమట్టం కూడా పెరుగుతోంది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై పీపాల్ కోఠి సమీపంలోని పాగల్ నల్, మాల్వాకు వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. యమునోత్రి హైవే, ధార్చుల, తవా ఘాట్ జాతీయ రహదారిపై కూడా రోడ్లు మూసుకుపోయాయి. మరికొద్ది రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చంపావత్, అల్మోరా, పితోరాఘర్, ఉధంసింగ్ నగర్, కుమావోన్ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.