Babli Bouncer Review: ‘బబ్లీ బౌన్సర్‌’గా తమన్నా మెప్పించిందా?

-

తమన్నా నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘బబ్లీ బౌన్సర్‌’. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మహిళా బౌన్సర్‌ కథతో తెరకెక్కిన తొలి సినిమా ఇదేనని, టైటిల్‌ పాత్రను సవాలుగా స్వీకరించానని ప్రచారంలో తమన్నా చెప్పుకొచ్చింది. మరి, ఈ బౌన్సర్‌ కథేంటి? తమన్నా మెప్పించిందా?

కథేంటంటే?: ‘బాక్సర్‌ టౌన్‌’గా పేరొందిన ఫతేపూర్‌ బేరి (దిల్లీ సమీపంలో) గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. కండలు పెరిగేందుకు తగిన వ్యాయామం చేయటం, బౌన్సర్లుగా దేశ రాజధాని దిల్లీలో ఉద్యోగం సంపాదించటం ఆ ఊరిలోని చాలామంది పురుషుల లక్ష్యం. ‘మగవాళ్లేనా.. మేమూ ఆ పని చేయగలం’ అనే ధోరణి బబ్లీ (తమన్నా)ది. ఈ విషయంలో.. పహిల్వాన్‌ అయిన బబ్లీ తండ్రి (సౌరభ్‌ శుక్లా) ఆమెను ప్రోత్సహించినా తల్లి మాత్రం ఒప్పుకోదు. బబ్లీకి త్వరగా పెళ్లి చేసేసి, బాధ్యత తీర్చుకోలానుకుంటుందామె. ఈ క్రమంలో పెళ్లి సంబంధాలను తీసుకురాగా బబ్లీ వాటిని తిరస్కరిస్తుంది. చివరకు.. తనను ఇష్టపడే కుక్కు (సాహిల్‌ వైద్‌)తో ఓ షరతు మేరకు పెళ్లికి అంగీకరిస్తుంది. మరోవైపు, తన స్కూల్‌ టీచర్ తనయుడు విరాజ్‌ (అభిషేక్‌ బజాజ్‌)పై మనసు పారేసుకుంటుంది. మరి, బబ్లీ పెట్టిన ఆ కండీషన్‌ ఏంటి? విరాజ్‌.. బబ్లీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడు? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే?: ప్రసిద్ధి చెందిన ప్రాంతం గురించి తెరకెక్కిన సినిమా అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. బౌన్సర్లను తీర్చిదిద్దటంలో ప్రఖ్యాతిగాంచిన ఫతేఫూర్‌ బేరికి సంబంధించిన కథ కావటంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇందులో ఆ ఊరి పేరు వినిపించటం మినహా అక్కడ నివసించే వారంతా ఎందుకు బౌన్సర్లుగా మారారు? కథానాయికను ప్రేరేపించిన సంఘటనేంటి? తదితర విషయాలేవీ ఈ చిత్రంలో కనిపించవు. దర్శకుడు ఈ చిత్రాన్ని ప్రేమకథగానే తెరపైకి తీసుకొచ్చారు. ప్రేమించిన వ్యక్తుల కోసమే కాదు తన చుట్టూ ఉన్న వారినీ బబ్లీ ప్రాణాలు తెగించి కాపాడుతుందనే పాయింట్‌ను ప్రధానంగా తీసుకున్నారు. ప్రేమ కోణంలోనూ ఈ కథను దర్శకుడు బలంగా చెప్పలేదనిపిస్తుంది. ‘ఐ యామ్‌ వెరీ వెరీ ఫన్నీ’.. ఈ సినిమాలో ఎక్కువగా వినిపించే డైలాగ్‌ ఇది. బౌన్సర్లంటే సాధారణంగా అందరూ సీరియస్‌గానే కనిపిస్తారు. దాన్ని బ్రేక్‌ చేసేందుకే ఈ మహిళా బౌన్సర్‌ను యాక్టివ్‌గా చూపించినట్టు ఉన్నారు.

 

తన స్నేహితురాలితో కలిసి బబ్లీ చేసే అల్లరి, పెళ్లి సంబంధాలను చెడగొట్టడం తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం రొటీన్‌గా సాగింది. ఒకటి రెండు చోట్ల తప్ప ఆసక్తిని పెంచే సీన్లు లేవు. ద్వితీయార్ధం కొంత ఊరటనిస్తుంది. విరాజ్‌-బబ్లీ, తన తండ్రి- బబ్లీకి మధ్య సాగే కొన్ని సీన్లు భావోద్వేగాన్ని పండిస్తాయి. పదో తరగతి ఐదు సార్లు ఫెయిల్‌ అయిందంటూ బబ్లీని చూసి నవ్వుకునే గ్రామస్తులే ఆమె చేసిన మంచి పనిని ప్రశంసిస్తారు. అలాంటి సన్నివేశాలపైనే దర్శక- రచయితలు శ్రద్ధపెట్టి ఉంటే ఈ సినిమా స్ఫూర్తిమంతగా నిలిచేది.

ఎవరెలా చేశారంటే?: ఈ చిత్రం తమన్నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఎంతో హుషారైన పాత్రలో ఒదిగిపోయింది. కానీ, కొన్ని సన్నివేశాల్లోనే ఆమెను బౌన్సర్‌గా చూస్తాం. కథానాయిక తండ్రిగా సౌరభ్‌ శుక్లా, అభిషేక్‌ బజాజ్‌, సాహిల్‌ వైద్‌లు ఫర్వాలేదనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లోని నేపథ్య సంగీతం తప్ప ఏ ఒక్క పాటా ఆకట్టుకునేలా లేదు. మనీశ్‌ ప్రధాన్‌ ఇంకా ఎడిట్‌ చేయాలి. హిమాన్‌ ధమీజా సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ‘ఫ్యాషన్‌’, ‘హీరోయిన్‌’ వంటి పలు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు తీసిన మధర్‌ భండార్కర్‌ ‘బబ్లీ’ని బలంగా చూపిస్తే బాగుండేది.

ప్లస్, మైనస్ పాయింట్స్… తమన్నా లుక్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. రొటీన్ స్టోరీ, కథలో కాస్త జాగ్రత్త పడితే బాగుంటుంది.కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లుగా అనిపించింది.

చివరగా: రొటీన్ కథ అయినా కూడా అంతగా నష్టమేమీ లేదు అన్నట్లుగా ఉంది.కామెడీ మాత్రం పెద్దగా పండలేదు అని చెప్పవచ్చు.

రేటింగ్. 2.5/5

Read more RELATED
Recommended to you

Latest news