ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ తొలి స్థానంలో ఉన్న విషయం విదితమే. అయితే మన దేశంలో ఆ సంస్థ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో షియోమీ ఉంది. ఇక సెకండ్ హ్యాండ్ ఫోన్ల విషయానికి వస్తే మన దేశంలో యాపిల్ మొదటి స్థానంలో ఉండడం విశేషం.
యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు ఎక్కువ సంవత్సరాల పాటు నడుస్తాయని పేరుంది. అందుకనే పాత మోడల్స్ అయినా సరే సెకండ్ హ్యాండ్‌లలో ఐఫోన్లనే భారతీయులు ఎక్కువగా కొంటున్నారు. ఈ మేరకు ప్రముఖ క్లాసిఫైడ్ వెబ్‌సైట్ ఓఎల్ఎక్స్ తెలియజేసింది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్లు నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం.
ఇక యాపిల్ తరువాతి స్థానాల్లో వరుసగా షియోమీ, శాంసంగ్, వివో, ఒప్పో, రియల్‌మి నిలిచాయి. మన దేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్‌లో యాపిల్ ఏకంగా 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఇక కోవిడ్ కారణంగా టైర్ 3 సిటీల్లోనూ సెకండ్ హ్యాండ్ ఫోన్లకు డిమాండ్ 43 శాతం మేర పెరిగింది. అందువల్లే సెకండ్ హ్యాండ్ ఫోన్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో యాపిల్‌కు చెందిన ఐఫోన్లే ఎక్కువగా ఉంటుండడం విశేషం.