అలువేలు మంగమ్మకు ఆరగింపులు, సారె ఏంటో తెలుసా!!

-

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఆ స్వామి పట్టపురాణి తిరచానూరు పద్మావతి. ఆ తల్లికి నిత్యం ప్రత్యేక పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదించే పదార్థాల వివరాలు తెలుసుకుందామా….

ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవలో పాలు, పండ్లు ఆరగింపు చేస్తారు.ప్రతిరోజు ముప్పూటలా పులిహోర, మిరియపు పొంగలి, చక్కరపొంగలి, దధ్యోదనాలను ఆరగింపు చేయడంతోపాటు ప్రత్యేకంగా మొదటి నివేదనలో సిరా (రవ్వకేసరి), మధ్యాహ్నం రెండో నివేదనలో లడ్డూలు, వడలను నివేదన చేస్తారు. నిత్యమూ జరిగే శ్రీపద్మావతి పరిణయోత్సవవేళలో అప్పాలు, చక్కెరపొంగలి, పులహోరలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం వేళలో జరిగే ఊంజల్‌సేవలో సిరులతల్లికి శనగగుగ్గిళ్లు నివేదన చేస్తారు.

history Of alamelu mangapuram
history Of alamelu mangapuram

రాత్రి ఏకాంతసేవ (పవళింపు) సమయంలో గోరువెచ్చని పాలు, పంచకజ్జాయం నివేదిస్తారు. ప్రతి గురువారం తిరుప్పావడ సేవలో పులిహోరతోపాటు ప్రత్యేకంగా జిలేబీలు నివేదిస్తారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వేళ పద్మావతి తల్లికి ప్రత్యేకంగా పాయసం ఆరగింపు చేస్తారు. శుక్రవారం తోటలో ఆ మధ్యాహ్నం అభిషేకానంతరం వడపప్పు, పానకం, మిరయపు పొంగలి, పిదప అలంకరణ అయిన తర్వాత పులిహోర, దోసెలు, సుండలు నివేదిస్తారు.

అలువేలు మంగమ్మ సారె!

పద్మావతి పుట్టినరోజుకు జరిగే పదినాళ్ల పండుగలే కార్తీక బ్రహ్మోత్సవాలు. చివరిరోజు అంటే అలువేలు మంగమ్మ అవతిరించిన పంచమీ తీర్థం నాటికి తిరుమల పరంధామడు ప్రియంగా పుట్టినరోజు సారెను పంపిస్తాడు. రెండు పట్టుచీరలను, రెండు పట్టురవికలను, పసుపుముద్ద, శ్రీగంధపు కర్ర, పచ్చి పసుపు చెట్లు, పూలమాలలు, తులసీమాలలతోపాటు ఒక బంగారు హారం, ఇవికాక పిండివంటలు, పడి (51) పెద్ద లడ్లూలు, ఒక పడి (51) వడలు అప్పాలు, ఒక పడి (51) దోసెలు. ఇలా వీటన్నింటిని ఆ రోజు ఉదయం ముందుగా తిరుమలలో శ్రీవారి మూలమూర్తికి సమర్పిస్తారు.

ఆ తర్వాత వీటిని దేవస్థానం అధికారులు, పరిచారకులు, సిబ్బంది కొత్త వెదురుబుట్టలలో పెట్టుకొని కాలినడకన అలిపిరి పాదాల మండపం దగ్గర్లోని శ్రీపద్మావతి పసుపు మండపం దగ్గరికి వస్తారు. అక్కడి నుంచి పసుపుకుంకుమ, చీర సారెలను ఏనుగు అంబారీపైన పెట్టుకొని మేళతాళాలతో శ్రీ కోదండరామాలయం స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరుచానూరు చేరుకుంటారు. అక్కడి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం అర్చకులు, అధికారులు తిరుమల శ్రీవారి సారెకు దివ్యమంగళ నీరాజనాలతో ఘనస్వాగతం ఇస్తారు. అనంతరం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఇదండి అమ్మవారి సారె సంగతి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news