రాముడు.. సుగణభిరాముడు… ఆయన జీవితంలోని ప్రతి అడుగు ఆదర్శం. ఆయన మాటతప్పని మనిషి. ధర్మం తప్పని నడవడి. ధర్మానికే భాష్యం చెప్పిన ఆయన జీవితాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. తండ్రి ఆన మేరకు వనవాసం చేసాడు ఆ రామయ్య తండ్రి, దానిలో భాగంగా ఆయన దండకారణ్యంలో సంచరించినట్లు పలు ఆధారాలు, ఆనవాళ్లు మనవారు నేటికి చెప్పుకుంటారు. అలాంటి వాటిలో ఆ సీతారామలక్ష్మణులు సంచిరించిన వాటిలో ప్రధానంగా చెప్పుకునేది పర్ణశాల. అది ఎక్కడ ఉంది, దాని విశేషాలు తెలుసుకుందాం….
భద్రాచలానికి కొద్ది దూరంలో ఉన్న పర్ణశాలలో రాములవారు సీతాసమేతంగా నివసించారని చెబుతారు. ఈ పర్ణశాల నుంచే రావణుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయాడట. ఆ సమయంలో జటాయువు అనే పక్షి సీతమ్మను కాపాడే ప్రయత్నం చేయగా, భద్రాచలానికి సమీపంలో ఉన్న యేటపాక అనే స్థలంలో రావణాసురుడు, జటాయువుని అంతమొందించాడన్నది స్థలపురాణం.
రాముడు పర్ణశాలలో నివసించాడనేందుకు తగిన ఆధారాలున్నాయంటున్నారు కొందరు పరిశోధకులు. డా॥ రామ్ అవతార్, వి.డి. రామస్వామి వంటివారు రామాయణ ఘట్టాలు, స్థానిక ఇతిహాసాల ఆధారంగా ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ప్రయత్నించారు. అయోధ్య మొదలుకొని లంక వరకు వనవాస సమయంలో రాముడు సాగించిన యాత్రను వీరు భారతదేశ పటంలో గుర్తించారు. డా॥ రామ్ అవతార్ అయితే ఇలా ఏకంగా 195 ప్రాంతాలను గుర్తించారు. వీటిలో భద్రాచలం కూడా ఒకటి. రాముడు దండకారణ్యంలో యాత్రను సాగిస్తూ, అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ….. దండకారణ్యంలో భాగమైన భద్రాచలంలో విడిది చేశారట. ఇక్కడ సీతమ్మవారు చీరను ఆరవేసిన గుర్తులు, ఆమె సేకరించిన కుంకుమరాళ్లు తదితర గుర్తులను ఇప్పటికీ స్థానికులు చూపిస్తూ ఉంటారు.
భద్రాచలం నుంచి రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ పంపానదీ తీరంలో శబరినీ, ఆ తరువాత రుష్యమూక పర్వతం మీద సుగ్రీవునీ కలుసుకున్నారట. ఇక అక్కడి నుంచి సాగిన రామాయణ కథ అందరికీ తెలిసిందే. అదండీ సంగతి ఇక్కడ రాముల వారి అరణ్యవాసంలో కీలక ఘట్టాలను ఈ ప్రదేశంలోనే జరిగాయి. ఆ స్వామి వారి జన్మదినం నాడు స్వామి జీవిత చరిత్రను ఒక్కసారి మననం చేసుకుంటే స్వామి వారి రామాయణ పారాయణ ఫలం లభిస్తుందని పెద్దల ఉవాచ. జై శ్రీరామ్.
-శ్రీ