- 3 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశం
- వైఎస్ ఆర్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం
అమరావతిః ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నవరత్నాలు-సంక్షేమ కార్యక్రామాలపై తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా పలు పథకాలు, ప్రస్తుత చర్యలు, ఫలితాలపై సీఎం ఆరా తీశారు. మరీ ముఖ్యంగా “నవరత్నాలు-పేదలందరికీ ఇండ్లు” కార్యక్రమం గురించి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులకు పలు కీలక ఆదేశాలు చేశారు.
ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న వైఎస్ ఆర్ జగనన్న కాలనీల్లో అంతర్జాల సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలపారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుడికి మూడు నెలల్లోపు పట్టాలు అందించాలని అధికారులకు సూచించారు. అలాగే, ఈ కాలనీలలో చేపట్టనున్న నిర్మాణాల్లో నాణ్యత, సారుప్యతలు మెరుగైనవిగా ఉండలన్నారు. వ్యర్థాల నిర్వహణకు బయో మైనింగ్ విధానం అనుసరించాలని సూచించారు.
ఇప్పటికే తమ ప్రభుత్వం 30.06 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేసిందని తెలిపారు. వీరిలో 26.17 లక్షల మందికి ఇండ్ల పట్టాలు అందించినట్టు తెలిపారు. మిగతా పట్టాలను లబ్దిదారులకు మరో మూడు రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే, ఆయా కాలనీలలో జనాభా ప్రాతిపాదికగా ఆరోగ్య కేంద్రాలు, బడులు, రవాణా సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.