పుట్టు మచ్చలు అనేవి సహజంగానే ప్రతి ఒక్కరికీ ఏర్పడుతుంటాయి. కొందరికి చిన్నతనంలోనే ఆ మచ్చలు వస్తాయి. కొందరికి వయస్సు పెరిగే కొద్దీ మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇక ఆ మచ్చలు వాటంతట అవే మాయమవుతుంటాయి. అయితే మరి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ? పుట్టు మచ్చలు ఎందుకు ఏర్పడుతాయి ? ఎందుకు మాయమవుతాయి ? అంటే…
పుట్టు మచ్చలు రెండు రకాలుగా ఏర్పడుతాయి. మన శరీరంలో సహజంగానే చర్మం రంగును నిర్దారించే పిగ్మెంట్లు ఉంటాయి. అవి చర్మం కింద కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దీంతో అక్కడ మచ్చలు ఏర్పడుతాయి. ఇక పిగ్మెంట్ రంగుని బట్టి మచ్చలు భిన్న రకాల రంగుల్లో ఏర్పడుతాయి. అలాగే కొందరికి చర్మం కింది భాగంలో రక్తనాళాలు ఒక్క దగ్గర చేరడం వల్ల చర్మంపై మచ్చలు వస్తాయి. అలాగే కొందరికి వంశ పారంపర్యంగా కూడా మచ్చలు ఏర్పడుతుంటాయి.
అయితే ఏ కారణాల వల్ల మచ్చలు ఏర్పడినా అవి కొంత కాలానికి మాయమవుతాయి. పిగ్మెంట్ల కారణంగా వచ్చిన మచ్చలు అయితే వాటి ప్రభావం తగ్గేకొద్దీ మచ్చలు మాయమవుతాయి. అదే రక్తనాళాల వచ్చిన మచ్చలు అయితే ఆ సమస్య తొలగిపోగానే మచ్చలు మాయమవుతాయి. అయితే కొన్ని రకాల మచ్చలు మాత్రం క్యాన్సర్లకు దారి తీస్తాయి. మచ్చ సైజ్ పెరుగుతున్నా.. రంగు మారుతున్నా.. దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. అలాంటి స్థితి ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అది సాధారణంగా చర్మ క్యాన్సర్ అయి ఉంటుంది.
ఇక పుట్టు మచ్చలపై అనేక మందిలో అనేక రకాల అపోహలు కూడా ఉంటాయి. చేతబడి, బాణామతి, మంత్రాలు చేయడం వల్ల ఆ మచ్చలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. అయితే పుట్టు మచ్చలను తొలగించుకోవచ్చు. అందుకుగాను లేజర్ సర్జరీ, మెడిసిన్లు వాడడం, శస్త్ర చికిత్సలు చేయడం వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయినా.. ఒక్క క్యాన్సర్ మచ్చలు అయితే తప్ప ఆ మచ్చల వల్ల ఎలాంటి హానీ ఉండదు. కనుక వాటిని తొలగించాల్సిన పనిలేదు. కానీ కొందరికి ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉండి అంద విహీనంగా ఉన్నామనుకుంటే అలాంటి వారు ఆ మచ్చలను తొలగించుకోవచ్చు.