కరోనా వైరస్ నేపధ్యంలో ఏపీలో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ వారి కడుపు నింపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇక ఈ తరుణంలో ఎవరూ కూడా పస్తులు ఉండకూడదని సిఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనితో రేషన్ కార్డు లేకపోయినా సరే ప్రభుత్వం రేషన్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. రేషన్ తో పాటు రూ.వెయ్యి నగదు సాయం అందనివారికి త్వరలోనే అందించనున్నట్లు మంత్రి బొత్సా సత్యనారాయణ పేర్కొన్నారు.
బుధవారం నుంచి రెండో విడత రేషన్ అందిస్తామని.. రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వాలంటీర్ల ద్వారా రేషన్‌దారులకు కూపన్లు అందిస్తున్నామని… కూపన్ల మీద ఉన్న సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దారిద్య్రపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు ఇస్తున్న ప్రభుత్వం… ఎగువన ఉన్నవారికి పింక్ రేషన్ కార్డ్ ఇస్తుంది.
ఏ కార్డు పొందాలన్నా కనీసం వారం సమయం పట్టే అవకాశం ఉండగా ఇప్పుడు దాన్ని వేగంగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఐదు రోజుల్లోనే కార్డు ఇచ్చేలా అధికారులు ఏర్పాటు చేసారు. రేషన్ కార్డు దరఖాస్తు మీసేవ కేంద్రాల్లో దొరుకుతుంది. లేదు అంటే మీసేవ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తును నింపాక.. దానికి అవసరమయ్యే ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ తెలిపే తదితర డాక్యుమెంట్లు జత చెయ్యాలి.
దానిని తీసుకుని వెళ్లి మీసేవ సెంటర్‌లో అందజేసి, ఫీజు చెల్లిస్తే చాలు. అప్పుడు మీసేవ నిర్వాహకులు ఇచ్చే నంబరుతో కూడిన స్లిప్‌ను దాచుకోవాలి. మీరు అర్హులైతే రేషన్ కార్డు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వెబ్ సైట్ నుంచి వస్తుంది. ఆ స్లిప్ తీసుకుని వెళ్లి రేషన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. స్పందన యాప్ లేదా 1800 452 4440, 1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.