ఎన్‌కోర్ గేమ్స్ డెవలప్ చేసిన ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం గేమింగ్ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. అందులో భాగంగానే గేమ్‌ను తొలి రోజు పెద్ద ఎత్తున యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఒకే రోజులో ఈ గేమ్ ను 10 లక్షల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అందువల్ల గేమ్ పట్ల యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని స్పష్టమైంది.
అయితే గేమ్ ప్లే బాగానే ఉన్నప్పటికీ అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని పలువురు యూజర్లు కామెంట్ల ద్వారా తెలిపారు. అందుకు ఎన్‌కోర్ గేమ్స్ బదులిచ్చింది. ముందు ముందు గేమ్‌లోని లోపాలను తీర్చిదిద్ది మరిన్ని అప్‌డేట్స్‌ను, ఎపిసోడ్స్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఇక గేమ్‌లో తొలి ఎపిసోడ్‌లో భాగంగా గాల్వన్ వాలీలో భారత సైనికులకు, శత్రు సైనికులకు మధ్య యుద్ధం జరిగినట్లు ఉంటుంది. దాన్ని యూజర్లు ఆడాల్సి ఉంటుంది.
కాగా గేమ్ లో పబ్‌జి లాగే ఇన్ యాప్ పర్చేసెస్‌ను ఏర్పాటు చేశారు. అంటే.. గేమ్‌లో ఐటమ్‌లను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఒక్కో ఐటమ్‌కు కనీసం రూ.19 నుంచి గరిష్టంగా రూ.2,999 ధరను నిర్ణయించారు. ఇక గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి విరాళంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై లభిస్తుండగా, త్వరలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా దీన్ని లాంచ్ చేయనున్నారు.