కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రహస్య ఒప్పందం లేదు- బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్

హూజూరాబాద్ ప్రచారానికి రేపటితో తెరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. తాజాగా తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హుజూరాబాద్ మెనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో బీజేపీకి ఎలాంటి రహస్య ఒప్పందం లేదని, కాంగ్రెస్ తో బీజేపీ చేతులు కలిపిందనే టీఆర్ఎస్ పార్టీ ఆరోపనల్ని ఖండిస్తున్నట్లు తరుణ్ చుగ్ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఆహంకారాన్ని తానెప్పడు ఎక్కడా చూడలేదని తరుణ్ చుగ్ అన్నారు.

 హుజూరాబాద్లో కుక్కను నిలబెట్టి గెలిపిస్తామనడం టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి అద్దం పడుతుందన్నారు. అహంకారాన్ని తెలంగాణ ప్రజలు సహించరని, హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ అహంకారాన్ని తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు. డబ్బులతో హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్  గెలవాలని చూస్తుందన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న వాగ్ధానాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. హుజూరాబాద్లో గెలిచేది బీజేపే అని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్ ను ప్రజలు భారీ మెజారీటీతో గెలిపిస్తారని, తీర్పేంటో వచ్చేనెల 2న తేలుతుందని తరుణ్ చుగ్ అన్నారు.